నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 : మహిళా సంఘాలు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి వినూత్న జీవనోపాదులతో అడుగులు వేసి శ్రీకారం చుట్టాలని డిపిఎం గంగార్జున పిలుపునిచ్చారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జీవనోపాదులపై శిక్షణా తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా గంగార్జున మాట్లాడుతూ మహిళలు దీర్ఘకాలిక ఆదాయ వనరులైన వెదురు పెంపకం, మునగ ఆకు పెంపకం, విస్తరాకులు తయారీ, టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ల నిర్వహణపై ముందుకు రావాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఆర్జించే పై జీవనోపాదులపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ నూతన జీవనోపాదుల నిర్వహణ పైలెట్ ప్రాజెక్టుగా వీరబల్లి, రాయచోటి, తంబళ్లపల్లె ఎంపిక చేసి పై పథకాలు అమలు చేయడానికి సహకరించాలన్నారు. 35 సెంట్లు వెదురు సాగు తో ఏడాదికి 40వేల నుండి లక్ష వరకు ఆదాయం, ఎకరం మునగ ఆకు సాగుతో లక్ష నుండి రెండు లక్షల వరకు ఆదాయం, టమోటా ధర నిలకడ లేని సమయంలో ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని సాస్, ఊరగాయ, పౌడర్ ఉత్పత్తులతో ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. తంబళ్లపల్లె లోని మల్లయ్య కొండ, సాదుకొండల్లో దొరికే ముడి సరుకుతో జీవనోపాధి మార్గాలను అన్వేషిస్తామన్నారు. ఈ విషయమై రిసోర్స్ పర్సన్ లు కుసుమ, బామర్ది లు జీవనోపాదులపై వీడియో రూపంలో సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అంజనప్ప, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, సీసీలు రమణ, కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి మహిళా సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News