నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 04 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం వారు విద్యార్థులకు విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలికిరి సబ్ స్టేషన్ ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.వి. మహేష్ బాబు పాల్గొని విద్యుత్ ఉత్పత్తి నుంచి గ్రిడ్ వరకు జరిగే ప్రక్రియలు, ఏపీ జెన్‌కో, ఏపీ డిస్కమ్, ఏపీ ట్రాన్స్‌కో శాఖల విధులు, 11 కే.వి., 33 కే.వి., 130, 220, 400 కే.వి. టవర్ల గుర్తింపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సబ్‌స్టేషన్లు, హై టెన్షన్ టవర్లు, వోల్టేజ్ స్థాయిలపై అవగాహన పెంచుకోవడం ద్వారా పరిశ్రమల్లో ఉపయోగించే నిజమైన సాంకేతికతను అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. అల్ట్రా హై వోల్టేజ్ (UHT) సబ్‌స్టేషన్లు ఎక్కువ దూరాలకు భారీగా విద్యుత్‌ను సమర్థవంతంగా ప్రసారం చేయడంలో ముఖ్యమని, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో 765 కే.వి. ఏసీ లేదా 800 కే.వి. హెచ్‌వీడీసీ అల్ట్రా హెవీ టెన్షన్ సాంకేతికత అవసరమైందని, అధిక వోల్టేజ్ వల్ల నష్టాలు తగ్గి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ అంశాలపై పట్టు సాధించడం వల్ల గ్రిడ్ సిస్టమ్, పవర్ క్వాలిటీ, నష్టాల నియంత్రణ వంటి కీలక విషయాల్లో నైపుణ్యం పెరిగి, భవిష్యత్తులో పవర్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్,నిర్వహణ ఇంజనీర్ వంటి పాత్రల్లో రాణించే అవకాశం లభిస్తుంది అని అన్నారు. విద్యార్థులు పరిశ్రమల సందర్శనలో భాగంగా సమీప విద్యుత్ కేంద్రాలను సందర్శించడం ద్వారా విద్యుత్ పరికరాల వాస్తవ పనితీరు పై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ వంటి విద్యుత్ శాఖల పనితీరు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, ఈ.ఈ.ఈ. విభాగాధిపతి డాక్టర్ ఎ.వి. పవన్ కుమార్, కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.ఎస్. బాలాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News