నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్యారంపల్లి పాఠశాల డొనేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి: ఎన్‌ఎస్‌యూఐ అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాల్సిన పరిస్థితిలో డొనేషన్ల పేరుతో వసూళ్ల ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ విడుదల చేసిన వివరణలో విద్యార్థి ఆర్థిక పరిస్థితి బాగోలేక పదో తరగతి పరీక్ష ఫీజును ప్రధానోపాధ్యాయురాలే చెల్లించినట్లు పేర్కొనగా, మరోవైపు అదే విద్యార్థిని పాఠశాల అభివృద్ధి పేరిట డొనేషన్ కోరినట్లు ఆరోపణలు రావడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. గత ఐదేళ్లలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎంత మొత్తం డొనేషన్లు సేకరించారు, వాటికి అధికారిక రసీదులు జారీ చేశారా, ఏ బ్యాంకు ఖాతాలో జమ చేశారు, ఏ పనులకు ఖర్చు చేశారు, ప్రస్తుతం ఎంత మొత్తం నిల్వ ఉందనే అంశాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన మైనర్ విద్యార్థిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, విద్యార్థి గౌరవాన్ని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే సంబంధిత ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. వినతిపత్రంలో పేర్కొన్న అంశాలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకుని నిబంధనల మేరకు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అమృత్ తేజ వెల్లడించారు.
Reporter
Namitha News