నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం (22-12-2025) మహానీయ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి రమణ రెడ్డి మాట్లాడుతూ, భారత గణిత శాస్త్రానికి విశ్వవ్యాప్త ఖ్యాతిని తీసుకువచ్చిన మహానీయుడు శ్రీనివాస రామానుజన్ అని తెలిపారు. అంకెల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ఆసక్తి, పరిశోధనాత్మక దృక్పథం నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు రామానుజన్ జీవిత చరిత్ర, గణిత శాస్త్రానికి ఆయన చేసిన విశిష్ట సేవలపై ప్రసంగాలు చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. యూనిట్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
Reporter
Namitha News