నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మెన్ డాక్టర్ ఎన్. సేతు ఆదేశాలతో ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆద్వర్యంలో స్థానిక జిఆర్టీ గ్రౌండ్ లో రెండు రోజుల పాటూ జరిగిన ఉత్కంఠ భరిత క్రికెట్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ విజేతలుగా నిలిచారు. మొదటి రోజు జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లలో మొత్తం ఎనిమిది టీములు పాల్గొనగా వాటిలో రాయల్ చాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్, రాయల్ ఎంపరర్స్, క్లాసిక్ నైట్స్ నాలుగు టీములు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. వీటిలో రాయల్ చాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్ తో తలపడి విజయం సాధించగా, రాయల్ ఎంపరర్స్ పై క్లాసిక్ నైట్స్ టీం విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి క్లాసిక్ నైట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో సంతోష్ వీరోచిత బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడంతో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది. సంతోష్ కేవలం 26 బంతుల్లో 49 పరుగులు సాధించి జట్టు విజయానికి గట్టి పునాది వేసాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బారీ షాట్ కు యత్నించి ఔట్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ టీం 112 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన క్లాసిక్ నైట్స్ టీం పది ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ సునాయసంగా విజయం సాధించింది. క్లాసిక్ నైట్స్ టీం లో చరిత్ 29, క్యాప్టెన్ మణికంఠ 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్, రన్నర్స్ గా నిలచిన క్లాసిక్ నైట్స్ జట్లకు మదనపల్లి శాసనసభ్యుడు షాజహాన్ బాషా, విజయ భారతి పాఠశాల చైర్మెన్ డాక్టర్ ఎన్. సేతు, ప్రిన్సిపాల్ నిశ్చిత, బిటి కళాశాల ప్రిన్సిపాల్ మలిగి రాఘవరెడ్డి లతో కలసి ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపోటములు సహజమని క్రీడా స్పూర్తిని పెంపొందిస్తూ ఇంత చక్కగా రాణించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు.
Reporter
Namitha News