నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 07 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మహిళా దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా న్యూఢిల్లీ, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల ఎస్. కుందర్ పాల్గొన్నారు.కార్యక్రమాన్ని ముఖ్య అతిథి శ్యామల ఎస్. కుందర్, మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి లు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబాల నిర్మాణం నుండి దేశ నాయకత్వం వరకు, శాస్త్రం, క్రీడలు మరియు అనేక రంగాలలో మహిళలు గొప్ప విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. ఇందిరా గాంధీ, సుష్మా స్వరాజ్, కల్పనా చావ్లా, పి.వి.సింధు వంటి మహిళలు ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. మహిళా సాధికారత అంటే ఆధిపత్యం కాదు, సమానత్వం అని, విద్య, ఉపాధి మరియు గౌరవంలో సమాన అవకాశాలు ఉండాలని, మహిళలు ఎదిగితే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారత సంస్కృతిలో మహిళలను దేవతలుగా భావిస్తూ సరస్వతి, లక్ష్మీ, దుర్గా దేవుళ్ళను ఆరాధిస్తామని, మహిళల శక్తి సమాజ పురోగతికి అత్యంత అవసరమని అన్నారు. మిట్స్ యూనివర్సిటీ నందు గల 90.8 ఎఫ్‌ఎమ్ రేడియో స్టేషన్ ను సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ముందుగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా అధ్యాపకులకు మరియు విద్యార్థిని లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు ఉన్నత విద్యలో మహిళల శాతం 25 శాతానికి కూడా చేరుకోలేదని, అయితే ప్రస్తుతం అది 40 నుండి 45 శాతం వరకు పెరిగిందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత విద్యలో మహిళల శాతం 60 శాతానికి పైగా ఉందని అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పాల్గొనడం 50 శాతానికి పైగా ఉంటుందని, కానీ భారతదేశంలో మాత్రం అది ప్రస్తుతం సుమారు 27 శాతం మాత్రమే ఉందని తెలిపారు. మహిళల ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం 40 నుండి 45 శాతం వరకు పెరిగితే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదగగలదని అన్నారు. మిట్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనేక మంది మహిళా విద్యార్థులు విజయవంతమైన కెరీర్‌ను సాధించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. అంతేకాకుండా, కేరళ రాష్ట్రానికి చెందిన అనేక మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో విశేష సేవలు అందిస్తూ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారని అన్నారు. సేవా భావంతో పనిచేస్తే సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ, ఆర్థిక స్థిరత్వం అన్నీ లభిస్తాయని, మహిళల ఆశయాలు, కృషి మరియు నాయకత్వం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, సీనియర్ మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయ లక్ష్మీ, కోఆర్డినేటర్ డాక్టర్ షణ్ముగ ప్రియా, మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు
Reporter
Namitha News