నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర అమోఘం - మదనపల్లి గ్రంథాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం - హాజరైన ప్రముఖ మహిళా శిరోమణులు మదనపల్లె : సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర అమోఘమని ప్రముఖ మహిళా శిరోమణులు పేర్కొన్నారు.58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు బుధవారం గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి పోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జి.రాధిక,ట్రాఫిక్ ఎస్.ఐ శివ కామిని,బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కోటిరెడ్డి,కవయిత్రి హేమలత,బూన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి,వివేకానంద ఆశయం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంపు భానుప్రకాష్,మహిళా న్యాయవాది రమా,పోర్డ్ సభ్యురాలు సుభాషిణి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ మాట్లాడుతూ సమాజంలో యువతులు,మహిళలు విపత్కర పరిస్థితులు ఎదురైనా విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.అది సాధ్యం కావాలంటే యువతులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.గ్రంధాలయాలలో మహిళల హక్కులు,వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలపై అనేక పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు.ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణించడం శుభసూచకమన్నారు.ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకుని దేశ కీర్తిప్రతిష్టలను పెంచడం గర్వకారమని కొనియాడారు.భారత మహిళా క్రికెట్ జట్టు అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ విజయం యువతులలో స్ఫూర్తి నింపుతుందనడంలో సందేహం లేదన్నారు.అనంతరం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ నిత్యజీవితంలో ప్రశాంతంగా ఆలోచించినప్పుడే ఏదైనా సాధించవచ్చునన్నారు.ముఖ్యంగా యువతులు,మహిళలు ఒత్తిడికి లోనుకాకుండా తాము ఎంచుకున్న లక్ష్యాలు వైపు పయనించాలని సూచించారు.పురుషులతో పోల్చుకుంటే మహిళలకు అనేక ఇబ్బందులు ఉంటాయని,సమస్యలను సునాయసంగా అధిగమించి ముందుకు సాగడమే మహిళల గొప్పతనని ప్రశ్నించారు.మదనపల్లె ట్రాఫిక్ ఎస్.ఐ శివకామిని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువతులు,మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు.మహిళల్ సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి యాపును తీసుకొచ్చిందన్నారు.ప్రతి యువతి,మహిళా ఈ యాపును వారి మొబైల్ ఫోన్ల నందు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.ఈ యాప్ విపత్కర పరిస్థితుల్లో రక్షణగా నిలుస్తుందన్నారు.ఆంగ్లేయులపై పోరాటం చేసిన వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి,భారతదేశ ఉక్కు మహిళ,మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు.చివరగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కోటిరెడ్డి మాట్లాడుతూ ఓటమిని సవాలుగా తీసుకొని గెలుపు కోసం పట్టుదలతో ముందుకు సాగాలన్నారు.తాను పదిసార్లు బ్యాంకు పరీక్షలకు హాజరు కాగా 11వ ప్రయత్నంలో విజయం సాధించినట్లు గుర్తు చేశారు.మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని,ఆత్మ స్థైరంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆయన సూచించారు.మహిళా దినోత్సవం వంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంత కుమారిని అతిథులు అభినందించారు.అనంతరం అతిధులను గ్రంథాలయ అధికారిణి శాలువాలతో సన్మానించగా,ఆర్.వసంత కుమారిని ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ శాలువాతో సన్మానించి,మెమొంటోను అందజేశారు.అదేవిధంగా వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన బూన్ హైస్కూల్,బాపూజీ పాఠశాలల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతి జూనియర్ కళాశాల అధ్యాపకులు,విద్యార్థినులు,వివేకానంద ఆశయం ఫౌండేషన్ మహిళా సభ్యులు,జయమ్మ పాల్గొన్నారు.
Reporter
Namitha News