నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : మదనపల్లి మండలం సీటీఎం సోమలగడ్డలో జనసేన కార్యకర్తపై జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీటీఎం సోమలగడ్డకు చెందిన కె. రెడ్డప్ప కుమారుడు, జనసేన కార్యకర్త దిలీప్ కుమార్ శుక్రవారం రాత్రి తన స్నేహితుడు గంగాధర్‌తో మాట్లాడుతుండగా అదే గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన రమణ కుమారుడు రాజు, శ్రీనివాసులు కుమారుడు తేజ, మల్లికార్జున అభి కలిసి బీరు బాటిల్, రాళ్లతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో దిలీప్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరామ్ అర్థరాత్రి సమయంలోనే ఆస్పత్రికి సిబ్బంది తో మాట్లాడారు. శనివారం ఆయన నేరుగా బాధితుడు దిలీప్ కుమార్‌ను ఆప్యాయంగా పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందేలా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా బాధితుడికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అర్థరాత్రి సమయంలో బాధితుడి నుంచి సమాచారం అందగానే వెంటనే స్పందించి ఆస్పత్రి సిబ్బంది, పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తాలూకా పోలీసులను కోరినట్లు వెల్లడించారు. యువత మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జంగాల శివరామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువత సంక్షేమం, మాదకద్రవ్యాల నిర్మూలన, సురక్షిత సమాజ నిర్మాణం కోసం పలు కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించి యువతను తప్పుదోవ పట్టించే వారిపై నిరంతర నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత మంచి మార్గంలో నడిచి కుటుంబాలకు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో సీటీఎం నీటి సంఘాల చైర్మన్ కోసూరి వేమన్న, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మీపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News