నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన హార్సిలీ హిల్స్ లో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తో కలిసి ఆర్ అండ్ బి, పర్యాటక శాఖ, డిపిఓ, విద్యుత్తు శాఖ, కొత్తకోట ఎంపీడీవో, ఎమ్మార్వో తదితర శాఖల తో సమావేశంలో నిర్వహించి హార్సిలీ హిల్స్ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..పర్యాటకులను ఆకర్షించే విధంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గాలి బండ ప్రాంతంలో గాజు పెంకులు, ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, ఆ ప్రాంతంలో డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ వాడకం పై నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్లు, పార్కుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు,పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, పచ్చదనం పెంపు, వీక్షణ స్థలాల అభివృద్ధి వంటి పనులపై అధికారులతో చర్చించారు. హార్సిలీ హిల్స్ కు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు
ఈ సమావేశంలో సంబంధిత శాఖల డిపిఓ రాధమ్మ, పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బి, కొత్తకోట ఎమ్మార్వో, మండల అభివృద్ధి అధికారి కార్యాలయ అధికారులు,తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News