నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 09 : మదనపల్లి పట్టణం సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) నాలుగో సంవత్సరం విద్యార్థులు వినూత్న ఆలోచనతో “స్మార్ట్ నీ బ్రేస్ ఫర్ ఇన్‌స్టంట్ ఇంజరీ డిటెక్షన్” అనే ఆధునిక ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విద్యార్థులు సి. నందిని, కె. నందిని మరియు కె. నందిని లు ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్, పర్యవేక్షణలో ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారిత ధరించగలిగే స్మార్ట్ పరికరాన్ని రూపొందించారు. మోకాలి గాయాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వాటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ స్మార్ట్ బ్రేస్ అధునాతన పరికరం లో అమర్చిన మాయిశ్చర్ సెన్సర్ ద్వారా మోకాలిలో ఏర్పడే వాపు మరియు మోకాలి గుజ్జు పేరుకుపోయిన పరిస్థితులను గుర్తించవచ్చు. అలాగే జైరోస్కోప్ సెన్సర్ ను మోకాలి కదలికలను విశ్లేషించి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించమని వారు అన్నారు. ఈ వివరాలను ఆర్డినో మైక్రోకంట్రోలర్ విశ్లేషించి ఏవైనా అసాధారణ మార్పులు గుర్తించిన వెంటనే బజర్ ద్వారా హెచ్చరికను అందించడంతో పాటు ఎల్‌సీడీ డిస్‌ప్లేపై సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నోడ్‌ఎంసీయూ వై-ఫై మాడ్యూల్ సహాయంతో సేకరించిన సమాచారాన్ని క్లౌడ్‌కు పంపించి, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు మరియు వారి సంరక్షకులకు తక్షణ సమాచారం చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారని విద్యార్థులు తెలిపారు. మోకాలి గాయాలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సహాయం పొందేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులు, వృద్ధులు మరియు పునరావాస చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయి ఆరోగ్య సంరక్షణ పరిష్కారంగా తీర్చిదిద్దనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వినూత్న ఆలోచనను అభినందించిన ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ గౌరె, ఇటువంటి పరిశోధనాత్మక ప్రాజెక్టులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు
Reporter
Namitha News