నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని బిజెపి నాయకుడు నల్లారి నిరూప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తంబళ్లపల్లె లో జరిగిన ఎన్ డి ఏ తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం లో గత వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పెద్దిరెడ్డి కుటుంబం అభివృద్ధి చేయకపోగా అరాచకాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, అక్రమ కేసులు బనాయింపు, సహజ వనరుల దోపిడీ తో తంబళ్లపల్లె ను నిలువు దోపిడి చేశారని ఆరోపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేగా దాసరిపల్లి జై చంద్రారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం రాయచోటిలో జరిగే ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తంబళ్లపల్లె మండలం నుండి పెద్ద ఎత్తున ఎన్డీఏ లోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ చలపతి నాయుడు, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నరసింహులు, సోమశేఖర్, మ్యూజికల్ శివ, సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు మురళి, హరీష్, బిజెపి నాయకులు గోపాల్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, గాండ్ల సుబ్బయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News