నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో రెండు వారాల క్రితం తంబళ్లపల్లి మండల కేంద్రంలో మూడు డెంగు కేసులు నమోదయ్యాయి తిరుపతి, బెంగళూరులో చికిత్సలు చేయించుకున్న సంఘటన మరువకనే మండలంలో మరో రెండు డెంగు పాజిటివ్ కేసులు నమోదుతో ప్రజలు బెంబేలె త్తుతున్నారు. నమోదైన చోట ఏదో మొక్కుబడిగా వైద్య సేవలు అందించి మ..మ అనిపించగా మలేరియా అధికారులు అలా వచ్చి ఇలా పిచికారి చేసి ఫోటోలు దిగి పోతుండగా గ్రామ సర్పంచులు పారిశుద్ధ్య నివారణ చర్యలు చేపట్టడానికి చేతిలో చిల్లిగవ్వలేక అధికారుల బారి నుండి తప్పించుకు తిరగక తప్పడం లేదు. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ దిగువ పల్లెలో గత మూడు రోజుల క్రితం ఓ డెంగ్యూ కేసు నమోదు కాగా శనివారం అదే గ్రామానికి చెందిన మాధవరెడ్డి (36) డెంగ్యూ జ్వరంతో తంబళ్లపల్లి సిహెచ్సిని ఆశ్రయించాడు. మాధవ రెడ్డికి డెంగ్యూ పాజిటివ్ ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ వెంకట్రామయ్య గుర్తించి వెంటనే ఆయనకు ప్రత్యేక చికిత్స అందించాలని ఆదివారం డాక్టర్ రిచర్డ్ ను పురమాయించారు. మండలంలో మరో మారు డెంగ్యూ కేసులు బయటపడుతుండడం పై ఆయన స్పందిస్తూ ఈ డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకమని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదన్నారు. ముందస్తుగా జిల్లా స్థాయి తోపాటు మండల స్థాయి అన్ని శాఖల అధికారులు స్పందించి డెంగ్యూ నివారణ పై చర్యలకు స్పందించాల్సి ఉందన్నారు. డెంగ్యూ సోకిన గ్రామంలో మాత్రమే వైద్య సేవలు, పారిశుద్ధ్య పనులు చేపట్టడం కన్నా మండలం మొత్తం మూకుమ్మడిగా సమిష్టిగా ఇంటింట ఫీవర్ సర్వే తో డెంగ్యూ వ్యాధిని గుర్తించి పూర్తిస్థాయిలో నివారణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో భాగంగా గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీటి కాలుష్యం, వ్యక్తిగత పరిశుభ్రత చేపట్టితే డెంగ్యూ మహమ్మారిని మండలం నుండి తరిమికొట్టొచ్చని ఇందుకు వైద్య సిబ్బందికి గ్రామ సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు, ప్రజలు సహకారం అందించాల్సి ఉందన్నారు.
Admin
Namitha News