నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 21 : హార్సిలీ హిల్స్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి సహకారం అందించాలని స్కౌట్ అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు విన్నవించారు. బుధవారం ఉదయం మదనపల్లి నందు సబ్ కలెక్టర్ ను ఆయన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, స్కౌట్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 మే 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సాచార్ హార్సిలీ హిల్స్ నందు ఈ శిక్షణా కేంద్రానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు. అప్పటినుండి 8 జిల్లాలకు చెందిన రాయలసీమ విద్యార్థులే కాకుండా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ పొందడం జరుగుతోందని వారు తెలిపారు. శిక్షణ కేంద్రం నందు ప్రస్తుతం ఉన్న భవనాలు కూలిపోయే దశలో ఉన్నందున నూతన భవనాల నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్కౌట్ భవనానికి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. స్కౌట్ తో క్రమశిక్షణ పెంపొందుతుందని, బాలబటులు ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదిగేందుకు తమ వంతు కృషికి తోడ్పాటు అందించాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ హార్సిలీ హిల్స్ లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థలానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని దాని అభివృద్ధి కోసం తప్పక తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ మహమ్మద్ ఖాన్, బేసిక్ స్కౌట్ మాస్టర్స్ చంద్రశేఖర్ రెడ్డి, అన్వర్ బాషా, లక్ష్మీపతి, కబ్ మాస్టర్స్ భూపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News