నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - జనవరి 19 : భారత రాజ్యాంగ రూపకర్త,బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పై రాజ్యసభ సాక్షిగా అవమానకరమైన, అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర వామపక్ష పార్టీల ఉమ్మడి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా, ఆదివారం ఉదయం 11:30 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని జ్యోతి చౌక్ నందు గల అంబేద్కర్ విగ్రహం ఎదుట,సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. తొలుత నిరసనకారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కేంద్ర మంత్రి అమిత్ షా గో బ్యాక్,బిజెపి ప్రభుత్వం అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అమిత్ షా రాజీనామా చేయాలని,బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలనే ప్లేకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకేపల్లి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ;దేశ రాజకీయాలను,రాష్ట్ర రాజకీయాలను,పార్లమెంటును,ప్రజాస్వామ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఖూనీ చేస్తున్నారని,ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి మనువాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం కోసం జరుగుతున్న కుట్రలో భాగంగానే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవహేళన చేస్తూ అమీషా మాట్లాడిన తీరు మనవాద వైఖరికి అద్దం పడుతున్నదని ఆవేదన చెందారు.అంబేద్కర్ ను అభిమానించే వారిని ఉద్దేశించి నిత్యం అంబేద్కర్ నామం జపం చేస్తే ఏమి లాభం లేదని, అదేదో దేవుని జపం చేస్తే స్వర్గానికి పోతారని హేళనగా అమిత్ షా మాట్లాడడం అంబేద్కర్ ను అవమానించడమేనన్నారు.ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిలు అమిత్ షాను పనిలెత్తి మాట్లాడకపోగా, రాష్ట్ర పర్యటన సందర్భంగా రెడ్ కార్పెట్ పరుస్తూ గులాములు కొడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి,ఫెడరల్ స్ఫూర్తికి,లౌకికతత్వానికి భంగం కలిగిస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎస్. తంబయ్యశెట్టి,ఎం. గంగులప్ప,జి. నారాయణస్వామి,మనోహర్,రమణ,షఫీ,హబీబ్, శంకర,బావాజాన్, గంగులప్ప,చాంద్ బాషా గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News