నమిత న్యూస్ - Andhra Pradesh / ఎన్టీఆర్ ( విజయవాడ ) : విజయవాడ - సెప్టెంబర్ 21 : రాంచీలోని రెడ్ బ్రిక్ లేడీ ఇర్విన్ ఆస్పత్రి ఇప్పుడు విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆస్పత్రిని 1933లో చోటా నాగ్‌పూర్ ప్రాంతంలో ఏకైక స్త్రీరోగ, ప్రసూతి వైద్యశాలగా స్థాపించారు. తరువాత, బిర్లా గ్రూపు దాదాపు 210 ఎకరాల భూమిని దానం చేయడంతో, ఇది బిర్లా ఆసుపత్రిగా ప్రాచుర్యం పొందింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని పేదలు, గిరిజన ప్రజలకు ముఖ్యంగా ప్రసూతి సంబంధ వైద్య సహాయం కోసం ఇది ఏకైక ఆశగా నిలిచింది. కాలక్రమేణా రాంచీ సదర్ ఆస్పత్రిగా మారి… రేబిస్, క్షయ వ్యాధి, చిన్న గాయాలు, ఇతర సాధారణ వ్యాధుల చికిత్స కోసం ప్రసిద్ధి చెందింది. అయితే, 2014 మధ్యలో, జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రణాళిక ఈ ఆస్పత్రిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రణాళికలో రాంచీ సదర్ హాస్పిటల్ లోని ప్రధాన సేవలను పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పిపిపి) ద్వారా ప్రైవేటీకరించాలనేది లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. పిపిపి ద్వారా సమర్ధత పెరుగుతుందని, ఆధునీకరణ జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కానీ, సామాన్య ప్రజలు, ఉద్యమకారులు, ఆరోగ్య కార్యకర్తలల్లో మాత్రం వెంటనే ఆందోళన మొదలైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు అందుబాటులో వైద్యం లభిస్తుందా? లేక ప్రభుత్వ వైద్యసేవలు కార్పొరేట్ నియంత్రణలోకి వెళ్లిపోతాయా? అన్నదే ఆ ఆందోళన. 2014లో సీఎం రఘువర్ దాస్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆ ప్రతిపాదన చేసింది. ఇది ప్రపంచ బ్యాంక్ ప్రైవేట్ రంగ పెట్టుబడి విభాగమైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో రూపుదిద్దుకుంది. ఈ ప్రణాళిక ప్రకారం, పిపిపి మోడల్‌లో డయాగస్టిక్ సర్వీసులు, పాథాలజీ ల్యాబ్‌లు, పలు నాన్-క్లినికల్ కార్యకలాపాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలనుకున్నారు. ప్రైవేట్ పెట్టుబడి వస్తే మెరుగైన సౌకర్యాలు ఏర్పడతాయి, ఆలస్యాలు తగ్గుతాయి, నిర్వహణ మెరుగు పడుతుందని పిపిపి అప్పగించడానికి కారణాలుగా ప్రభుత్వం చెప్పింది. అయితే ఉద్యమకారులు చెప్పిన విషయాలు వేరే. ఇలాంటి ప్రైవేటీకరణకు సాధారణంగా వైద్య సేవల ఖర్చు పెరుగుతుందని, తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారు ఆస్పత్రి నుండి బయటకు గెంటివేయబడతారని, సామాజిక బాధ్యత గణనీయంగా తగ్గిపోతుందని వారు వాదించారు. వాస్తవానికి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సి) తన వెబ్‌సైట్‌లో రాంచీ సదర్ హాస్పిటల్‌ను పిపిపి లోకి మార్పు చేయల్సిన ప్రాజెక్టుగా పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు ఐఎఫ్‌సిని అధికారికంగా ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా నియమించారు. ఈ మార్పు ప్రణాళికను ప్లానింగ్ చేయడం, ప్రతిపాదనను మార్కెట్ చేయడం, బిడ్ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, కాంట్రాక్ట్ కుదిరే వరకు బిడ్డింగ్ ప్రక్రియలో ప్రభుత్వానికి సహకరించడం వంటి బాధ్యతలు ఈ సంస్థకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం-ప్రైవేట్ హెల్త్ కార్పొరేషన్ల మధ్య పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ ద్వారా రూ.100 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్లూప్రింట్ సిద్ధం చేశారు. తర్వలోనే మెదాంతా, అపోలో, ఎస్కార్ట్స్ వంటి ఆసుపత్రుల సిఇఓలు ఈ ఒప్పందం కోసం రాంచీకి పరుగెత్తుకొచ్చారు. మరో మాటలో చెప్పాలంటే, రాంచీ లోని కీలక ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ప్రపంచ బ్యాంక్ ఏజెన్సీ చక్కగా సిద్ధం చేసిన ప్రణాళిక ఇది. ప్రజా ప్రతిఘటన ఇలా ప్రారంభమైంది రాంచీలోని పలు సామాజిక సంస్థలు ఈ విధానంలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించాయి. రాంచీ సదర్ హాస్పిటల్ కేవలం ఒక సాధారణ ఆస్పత్రి కాదు. ఇది మొత్తం జార్ఖండ్ లోని లక్షలాది మంది పేదలకు ఉన్న ఏకైక ఆధారం. దీన్ని ప్రైవేటీకరించడం వలన ఫీజులు భరించలేని వారికి అవసరమైన వైద్యం అందుబాటులో ఉండదు. పలు సివిల్ సొసైటీ సంస్థలు, ప్రజా విజ్ఞాన సంస్థలు, మహిళా, యువజన, గిరిజన సంఘాలు, వృత్తి-వాణిజ్య సంఘాలు, వీధి వ్యాపారులు, వైద్యులు, పారామెడిక్స్, రాజకీయ పార్టీలు, అలాగే పి.పి.వర్మ, ఫాదర్ స్టాన్ స్వామి, ప్రొ. ప్రభాత్ సింగ్, దయమణి బార్లా, డా.కరుణా ఝా తదితర మేధావులు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. జన్ స్వాస్థ్య అభియాన్‌తో సహా విస్తృతమైన సంస్థలు, వ్యక్తులు చేతులు కలిపారు. ‘సదర్ ఆస్పత్రాల్ బచావో ఆందోళన్’ పేరుతో సంయుక్త వేదికను ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సదర్ ఆసుపత్రిని ప్రైవేటీకరణ నుంచి రక్షించే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం సామాన్య ప్రజలను ఆకర్షించింది. వారు ఈ వేదిక చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఎస్‌యుసిఐ, సిపిఐ, సిపిఎం, ఆర్‌జెడి వంటి రాజకీయ పార్టీలు కలిసివచ్చాయి. పలువురు సామాజిక కార్యకర్తలు, గిరిజన నాయకులు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. గవర్నర్, ముఖ్యమంత్రి, జార్ఖండ్ ఆరోగ్య కార్యదర్శికి పిటిషన్లు, విజ్ఞప్తులు అందాయి. ఈ ప్రతిఘటనలో ప్రజా స్థాయిలో మొదటి ముఖ్యమైన అడుగు 2014 జులై 28న పడింది. ఆ రోజున ఈ వేదిక ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తిని సమర్పించింది. ఆ విజ్ఞప్తిలో ఆసుపత్రిని ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న ప్రతిపాదనను స్పష్టంగా వ్యతిరేకిస్తన్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. దీని తరువాత, 2014 ఆగస్టు 3న రాంచీలోని అత్యంత రద్దీగా ఉండే ఫిరయాలాల్ చౌక్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేయాలని ఈ ఉద్యమం సాధారణ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ ప్రచారం వేగంగా ఊపందుకుంది. నగరమంతా వ్యాప్తి చెందింది. తమకు తెలియకుండా, తమ ఆస్పత్రికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. తర్వాతి కాలంలో వీధి సమావేశాలు, పాంప్లెట్ల పంపిణీ, బహిరంగ కార్యకలాపాలు వంటి చర్యలు చేపట్టారు. ప్రభాత్ ఖబర్, దైనిక్ భాస్కర్ వంటి పత్రికలు ఈ నిరసనల గురించి వార్తలు రాశాయి. విస్తృత ఐక్యతతో ముందుకు ఈ ఉద్యమం విస్తృత సామాజిక, రాజకీయ సంస్థలు, గ్రూపులు ఆధారంగా జరిగింది. వివిధ వామపక్ష, సామాజిక పార్టీలు, సంస్థలు, చివరకు ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ వైద్యులు కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించారు. 2015 జూన్‌లో ఒక ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి తమ డిమాండ్లను వివరించింది. సదర్ ఆసుపత్రిలోని అన్ని శాఖలు ప్రభుత్వ నిర్వహణలో ఉండాలి. పడకల సంఖ్య పెంచాలి. ఆస్పత్రిని ప్రైవేటీకరించే బదులు మరింతగా బలపర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. 2015 జూన్‌లో ధర్నా నిర్వహించారు. దీనిలో 8-పాయింట్ల డిమాండ్ చార్టర్‌ను ప్రకటించారు. దీంతో అప్పటి వార్తాపత్రికల్లోని వార్తల ప్రకారం పిపిపి పద్ధతిలో ఆస్పత్రిని అప్పగించడానికి ఎటువంటి ప్రక్రియ ప్రారంభం కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. నిరంతర ప్రజా ఒత్తిడి ప్రభుత్వంపై ప్రభావం చూపుతోందనడానికి ఒక స్పష్టమైన సంకేతం ఈ ప్రకటన. ఆ తరువాత ప్రైవేటీకరణ ప్రణాళిక నిలిచిపోయింది. వివిధ రూపాల్లో నిరంతరం కొనసాగిన ప్రజా ఆందోళనలు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. అసాధారణంగా, ధార్మికవేత్త అయిన ఒక వ్యాపారవేత్త పిపిపి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సదర్ ఆసుపత్రి బచావో ఆందోళన్ దీనిలో ఇంప్లీడ్ అయ్యింది. రాంచీ సిటిజన్స్ ఫోరమ్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది ఎంకె హబీబ్, రాంచీ సిటిజన్స్ ఫోరమ్ సెక్రటరీ డా.ప్రభాత్ సింగ్ కూడా జోక్యం చేసుకున్నారు. హబీబ్ మార్గదర్శకత్వంలో సదర్ ఆస్పత్రి బచావ్ ఆందోళన్ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జయంత్ పాండే మెదాంతా, అపోలో వంటి కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం కారణంగా వైద్య ఖర్చులు ఎలా పెరుగుతాయో డాక్యుమెంట్లతో సహా కోర్టులో వివరించారు ఉచిత వైద్యసేవల వసతి నిలిచి పోతుందని కూడా నిరూపించడానికి ఆయన ప్రయత్నించారు. సంబంధిత డేటా సమర్పించడం ద్వారా, పిపిపి కారణంగా జార్ఖండ్ లోని ఏకైక ప్రైవేటు ఆసుపత్రికన్నా ఎక్కువ చార్జీలు చెల్ల్లించాల్సి ఉంటుందని న్యాయస్థానంలో నిరూపణ అయ్యింది. అంతేకాదు, సాధారణ వ్యాధుల ప్రాథమిక చికిత్సను కూడా పక్కన బెడతారని, ఖరీదైన చికిత్సలపైనే దృష్టి పెడతారని తేలింది. కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శితో పాటు ఆరోగ్య మంత్రికి కూడా సమన్లు జారీ చేసింది. అడ్వకేట్ జయంత్ పాండే వాదనలు, ప్రజా నిరసన డాక్యుమెంట్లను కోర్టు సానుకూలంగా తీసుకుంది. దీంతో రఘువర్ దాస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్లు డాక్యుమెంటరీ సాక్ష్యానికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలను కోర్టులో చూపలేకపోయారు. ప్రజల విజయం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ ప్రతిపాదనలను రద్దు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పిపిపి కాంట్రాక్టులో పేర్కొన్న అన్ని బాధ్యతలను పూర్తిచేయడానికి స్వీయ బాధ్యత తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రజల సమ్మతి లేకుండా ఎటువంటి ప్రైవేటీకరణ పనులు జరగవని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్, ఐఎఫ్‌సి కలిసి ప్రతిపాదించిన ప్రైవేటీకరణ ప్రణాళిక ప్రజా ఉద్యమ బలంతో స్పష్టంగా వెనక్కు నెట్టబడింది. రాంచీ యొక్క అతి పెద్ద ప్రజా ఆసుపత్రిని ప్రజలు కాపాడుకోగలిగారు. భారతదేశంలో ఆరోగ్య సేవలను ప్రైవేటీకరించి తీరాలని ప్రపంచబ్యాంకు నిర్దేశిస్తోంది. అయితే, విస్తృత వర్గాలకు చెందిన ప్రజలు ఐక్యంగా ఈ తరహా ప్రయత్నాలను అడ్డుకోవచ్చని, అంతర్జాతీయ సంస్థలను కూడా వెనక్కి నెట్టవచ్చని రాంచీ అనుభవం తెలియచేస్తోంది. విజ్ఞప్తులు, సంతకాల సేకరణ, వీధి సమావేశాలు, ధర్నాలు, న్యాయపరమైన చొరవ వంటి సాధారణ కార్యక్రమాలతో పాటు నిరంతరాయంగా వాటిని కొనసాగించడం, ఐక్యతను నిలుపుకోవడం ద్వారా రాంచీ ప్రజలు ఈ విజయాన్ని సాధించారు. ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం మరోసారి ఆరు జిల్లా ఆసుపత్రులను పిపిపి పద్ధతిలో ప్రైవేటీకరించాలని ప్రణాళిక రూపొందిస్తోంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి జార్ఖండ్ స్వాస్థ్య అభియాన్ సిద్ధమౌతోంది.
Admin
Namitha News