నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహాన్యూస్ కార్యాలయంపై దాడి దుర్మార్గపు చర్య - తీవ్రంగా ఖండించిన ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు - మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులు అరికట్టాలని విజ్ఞప్తి మదనపల్లె : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మహాన్యూస్ కార్యాలయంపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడి చేయడం హేయమైన చర్యని ది మదనపల్లి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది.సోమవారం ది మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు అధ్యక్షులు నక్కింటి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్బంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతమన్నారు.సమాజంలో నాలుగవ స్తంభంగా కొనసాగుతున్న ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియాలపై దాడిచేయడం అంటేనే మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు.బిఆర్ఎస్ పార్టీకి చెందిన అల్లరి మూకలు మహాన్యూస్ కార్యాలయంపై రాళ్లు కట్టెలతో దాడికి పాల్పడి కంప్యూటర్లు,అద్దాలు ధ్వంసం చేసి,దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు.అనంతరం ఉపాధ్యక్షులు నానాబాల కుమార్,సంయుక్త కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి,కార్యవర్గ సభ్యుడు అశోక్ కుమార్లు మాట్లాడుతూ మీడియాపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపైన దాడి చేయడమేనన్నారు.పాత్రికేయు లపైన,మీడియా కార్యాలయాలపైన దాడులు సమర్థనీయం కాదన్నారు.మీడియా,మీడియా ప్రతినిధులపై దాడులను అరికట్టడానికి కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకురావాలని,ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ది మదనపల్లి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు బి.శ్రీనివాసులు రెడ్డి,లక్ష్మి పతి,ప్రణీత్,విజయ్,మణి కుమార్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News