నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలి! జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ రాయచోటి నమిత న్యూస్ మార్చి 17:-జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు వివారించారు.రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పటిష్టంగా అమలు పరచడంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ హాజరై జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోను మరియు 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాల్సి ఉందన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సి-విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుండి అందే ఫిర్యాదులపై అదే రోజున చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల కోసం అన్ని విధాలా సంసిద్ధత ఎంతో కీలకమైనదన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ - ఎంసిసి) అమలుపై అందరు ఎన్నికల అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎంసిసి, ఎఫ్.ఎస్.టీ టీమ్ లు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు, ఫోటోలను, ఇతర క్యాలెండర్లు, జెండాలను, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో, రోడ్డు కిరువైపులా, మీటింగ్ ప్రాంతాల్లో అన్ని హోర్డింగులను తక్షణమే తొలగించేలా రిటర్నింగ్ అధికారులు సంబంధిత ఏఆర్వోలు, ఎంపిడిఓలతో మాట్లాడాలని, అన్నింటినీ తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్.ఎస్.టీ టీమ్ లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమీషన్ సూచనలు తప్పనిసరిగా పాటించి ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణరావు, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News