నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు కు పుట్టినిల్లు. భూములున్నా సకాలంలో వర్షాలు లేక సాగునీటి సౌకర్యం లేక వేసిన పంటలకు గిట్టుబాటు లేక రైతులు దినసరి వలస కూలీలకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడింది ఓ రైతు దీనగాధ. తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన మాచి రెడ్డి గారి సిద్ధారెడ్డి (55) మధ్యతరగతి రైతు. జీవనోపాధి కోసం పలువురు సుదూర ప్రాంతాలకు టమోటా కర్రలు నాటే పనికి వెళుతుండగా సిద్ధారెడ్డి సైతం విధి లేని పరిస్థితుల్లో మదనపల్లెకు సమీపంలోని చెంబకూరు సమ్మి రెడ్డి గారి పల్లి లో టమోటా పంటలకు కర్రలు నాటే పనికి వారం రోజులు క్రితం వెళ్ళాడు. అక్కడ టమోటా కర్రలు తరలించే క్రమంలో ఆ కర్రలు మొత్తం సిద్ధారెడ్డి మీద పడి కర్రలు తలలో దిగడం తోపాటు కింద రాళ్లు తలకు తగిలి తీవ్ర రక్త గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సిద్ధారెడ్డిని మదనపల్లె ఆసుపత్రికి తరలించగా పరిస్థితి చేయి దాటిందని వెంటనే బెంగళూరు వెళ్లాలని సూచించారు. బెంగళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సకు చేర్పించారు. వారం రోజులుగా సిద్ధారెడ్డి ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లాడు. ఆయన ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు ఇంటి వద్ద నుండి నగనట్రా అమ్ముకుని అందిన కాడికి అప్పులు చేసి సుమారు ఆరు లక్షలకు పైగా ఖర్చు చేశారు. శనివారం తెల్లారి జామున పరిస్థితి విషమించి సిద్ధారెడ్డి ఆసుపత్రిలో కన్ను మూశాడు. జీవనోపాధికి వెళ్లి విగత జీవుడై రావడం, పుట్టెడు అప్పులు మిగలడం ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. డబ్బులు పోతే పోనీ మనిషి మిగలకపాయనే స్వామి అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. జూనోపాధి కోసం వెళ్లి మృత్యువాత పడిన సిద్ధారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు కోరుతున్నారు.
Reporter
Namitha News