పుంగనూరు - అక్టోబర్ 20 : పుంగనూరు లో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎం.ఎస్. సలీం పేరును చేర్చడంపై ముస్లిం మత పెద్దలు, అంజుమన్ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 ఘర్షణతో సంబంధం లేని వ్యక్తిపై కేసు నమోదు చేయడం బాధాకరమని పేర్కొంటూ, ఆయనపై కేసును వాపస్ తీసుకోవాలని టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడును కోరారు.

గత నాలుగు రోజుల క్రితం పుంగనూరులో స్థానిక ఎన్నికల నామినేషన్‌కు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నమోదైన పోలీసు కేసులో అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎం.ఎస్. సలీం పేరు చేర్చడం సరికాదని మైనారిటీ మత పెద్దలు తెలిపారు.

అంజుమన్ కమిటీ అనేది ముస్లిం మైనారిటీల అభివృద్ధికి సంబంధించిన సంస్థ అని, రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. అంజుమన్ కమిటీ, షాదీ మహల్ అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు గతంలో సహకారం అందించారని గుర్తుచేశారు.

ఘర్షణ జరిగిన సమయంలో ఎం.ఎస్. సలీం అక్కడ లేరని, ఘటనతో సంబంధం లేని ఆయన పేరును కేసు నుంచి తొలగించాలని అంజుమన్ కమిటీ సభ్యులు, ముతవల్లీలు, ఇమామ్‌లు కోరారు.

ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

      మీడియా సమావేశంలో మైనారిటీ మత పెద్దలు ఎం.ఎస్. సలీం, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షా, హజరత్ ఇర్ఫాన్, బద్రుల్లాతో పాటు పెద్ద సంఖ్యలో ముతవల్లీలు, ఇమామ్‌లు పాల్గొన్నారు.