మదనపల్లి - అక్టోబర్ 12 : రాబోయే మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించే రిజర్వేషన్ ప్రక్రియ నేపథ్యంలో కూటమి పార్టీల తరఫున అభ్యర్థి ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. మదనపల్లె మున్సిపాలిటీని జనసేన పార్టీకి కేటాయించే అంశంపై కూటమిలో సమన్వయం కొనసాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నీరుగట్టువారిపల్లికి చెందిన జనసేన మహిళా నాయకురాలు బండి భారతి పేరు చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది. మదనపల్లె రాజకీయాల్లో మైనార్టీ ఓట్లతో పాటు బీసీ ఓట్లు కూడా కీలక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉండే నాయకురాలిగా గుర్తింపు ఉన్న బండి భారతివైపు కూటమి మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె అభ్యర్థిత్వంపై కూటమిలోని ప్రధాన నాయకులు సైతం పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదనే ప్రచారం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే జనసేన పార్టీ తరఫున బండి భారతి మదనపల్లె మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై జనసేన, తెలుగుదేశం కూటమి నాయకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మదనపల్లె మున్సిపల్ పీఠం కోసం కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బండి భారతికి అవకాశం దక్కుతుందా? అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది