అంగరంగ వైభవంగా శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడాలి: రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు

మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె నవోదయ కాలనీలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీరాముని ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాల్మీకి సంఘం నాయకులు, వాల్మీకి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహర్షికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ద్వారా శ్రీరాముని చరిత్ర, ఆయన గుణగణాలు, ధర్మమార్గం, ఆదర్శవంతమైన జీవన విధానం ప్రపంచానికి తెలిసాయని పేర్కొన్నారు. మానవాళికి ధర్మం, నీతి, సత్ప్రవర్తన వంటి విలువలను బోధించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. అటువంటి మహనీయుని జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం సుమారు 70 సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నప్పటికీ తమ హక్కు సాధనలో ఇంకా ఆశించిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వాల్మీకి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.వాల్మీకి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని, ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఐకమత్యంతో ఉద్యమ బాటలో పయనించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు తుమ్మల కమలమ్మ, రాష్ట్ర సలహాదారుడు కొత్త ఉడుం శేఖర, అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, పుంగనూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు మనీ, నవోదయ కాలనీకి చెందిన సాంబశివలి, రమణ, కరుణాకర్, రఘు, గీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడాలి: రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు