ఆశీర్వదించండి పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తా

- కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ వెల్లడి

మదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీ చైర్మనుగా తనకు ఒక్క అవకాశం ఇస్తే మదనపల్లె పట్టణ రూపురేఖలు మార్చి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ ప్రకటించారు.శనివారం పట్టణంలోని దక్నీపేటతోపాటు వివిధ ప్రాంతాలలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటర్లను నేరుగా కలిసి కరపత్రాలు పంచి పెడుతూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.దినదినాబివృద్ధి చెందుతున్న మదనపల్లె పట్టణంలో అనేక సమస్యలు తీష్టవేశాయని వాటికి శాశ్వత పరిష్కారం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.ప్రజలు ఇప్పటికే అధికార మరియు ప్రతిపక్ష పార్టీలకు కౌన్సిల్లో అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇస్తే నిజాయితీతో బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించి అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.మదనపల్లె పట్టణ రూపురేఖలు మార్చడానికి తన వద్ద ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉందని,మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.విజ్ఞులైన పుర ప్రజలు విద్యావంతుడు,వైద్యుడుగా తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కేవలం ప్రజాహితం కోసం,జన్మభూమికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కే బాషా,కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణా రెడ్డి,ఖాదర్ బాషాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనన్నారు.హస్తం గుర్తుపై మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ అప్సర్ షరీఫ్ ను గెలిపించి కౌన్సిల్ కు పంపాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.