ఈ నెల 26న విఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు
- అదికవి జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
- రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దేవరింటి సుధాకర్ డిమాండ్
మదనపల్లె : ఈ నెల 26న వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతిని మదనపల్లెలో నిర్వహించనున్నట్లు
రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దేవరింటి సుధాకర్ ప్రకటించారు.శనివారం స్థానిక మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ దేవరింటి సుధాకర్ మాట్లాడుతూ ఆదికవి వాల్మీకి రామాయణాన్ని రచించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను,మానవత్వ విలువలను చాటిచెప్పడం జరిగిందని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని కావున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.అంతేకాకుండా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకులకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అన్నిరంగాలలోనూ వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలోని అన్నిరాష్ట్రాలలో వాల్మీకులు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని,కేవలం ఒక్క ఏపీలో మాత్రమే బీసీలుగా ఉన్నారని దీనిపై దశాబ్దాలుగా పోరాడుతున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదని గుర్తు చేశారు.దీనిపై వాల్మీకి బిడ్డలంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేవిధంగా ఐక్యత నినాదాన్ని వినిపించనున్నట్లు స్పష్టం చేశారు.వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేవిధంగా ఉద్యమాన్ని వాల్మీకి జయంతి రోజున ఉధృతం చేయడానికి శ్రీకారం చుట్ట నున్నట్లు ప్రకటించారు.వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసం వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాజీలేని పోరాటం చేయడానికి సిద్ధమన్నారు.జిల్లా అధ్యక్షులు మంజునాథ్,మహిళా నాయకులు గౌరమ్మ,గాయత్రిలు మాట్లాడుతూ వాల్మీకి బోయల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఖండించారు.ఇప్పటికైనా వాల్మీకి బిడ్డల భవిష్యత్తు కోసం ఎస్టి జాబితాలో చేర్చడంతోపాటు వాల్మీకి మహర్షి జయంతి రోజున సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించి గౌరవించాలని కోరారు.లేనిపక్షంలో మలి విడత ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చ రించారు.అదేవిధంగా ఈనెల 26వ తేదీ సోమవారం పట్టణంలోని చిత్తూరు బస్టాండ్,వాల్మీకి కూడలిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ జయంతి వేడుకలకు వాల్మీకి సోదరులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు కలిచర్ల నరసింహులు పాల్గొన్నారు.

Rukmini M






