తంబళ్లపల్లె - అక్టోబర్ 22 : తంబళ్లపల్లె మండల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రెండవ రోజు ఇరువర్గాల మధ్య రణరంగం చోటుచేసుకుని పరస్పరం కవ్వింపు చర్యలతో రాళ్ళు, కర్రలు, పెట్రోల్ బాంబులతో దాడులు జరిగి వైకాపా నాయకుల దాడిలో టిడిపి నాయకుడు పురుషోత్తం ట్రాక్టర్ అగ్నికి ఆహుతి కాగా పక్కనే గల టిడిపి నాయకుడు మ్యూజికల్ శివ ఇంటి ముందు సామాగ్రి ధ్వంసం చేశారు. పక్కనే గల జనసేన పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడి నానా రభస సృష్టించారు. వైకాపా, టీడీపీ ఇరువర్గాల దాడులను ఆపడంలో పోలీసులు చేతులెత్తేశారు. తొలుత వైకాపా నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్ద నుండి ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి వందలాదిగా సిద్ధమయ్యారు. స్థానిక టిడిపి నాయకులు వారిని అడ్డుకోవడానికి పోలీసుల బారికేడ్ల వద్ద కాపల కాశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో టిడిపి నాయకులు భోజనానికి వెళ్లిన సమయంలో వైకాపా నాయకులు అదను గా భావించి నామినేషన్ వేయడానికి తరలి వచ్చారు. స్థానిక పోలీసులు వివాదాలు లేకుండా నామినేషన్లు వేయడానికి వైకాపా శ్రేణులను తీసుకువస్తుండగా కొందరు టిడిపి యువ నేతలు మహిళా వైకాపా నేత నామినేషన్ పత్రాలను చించి వేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఓ మహిళా లాయర్ పై జులుం ప్రదర్శించడంతో. రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలతో ఎంపీడీవో కార్యాలయం వైపు బారికేడ్లును తోసి పడేసి దూసుకొచ్చారు. ఈ సందర్భంగా రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులు విసురుతూ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడులలో టిడిపికి చెందిన మూలపల్లి ధన శేఖర్, శ్రీనివాస కాలనీ కి చెందిన నాగభూషణం లకు తలకు గాయాలయ్యాయి. వైకాపాశ్రేణులను అడ్డుకోవడానికి అక్కడే ఉన్న టిడిపి నాయకులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేక టిడిపి నేత పురుషోత్తం కు చెందిన ట్రాక్టర్ను దగ్ధం చేయడంతో పాటు మ్యూజికల్ శివ ఇంటి సామాగ్రి, ద్విచక్ర వాహనం ను నడిరోడ్లు పై వేసి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. పక్కనే గల జనసేన పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడ్డారు ప్లెక్సీలు, గ్రిల్స్ లాగి పడేసి చిందరవందర చేశారు. నడిరోడ్డు పై జరుగుతున్న ఇరువర్గాల దాడుల నేపథ్యంలో పేలుతున్న శబ్దాలకు ప్రజలు, పక్కనే కాదు దుకాణదారులు, బెంబేలెత్తిపోయారు. ఈ శబ్దాల మోతకు పక్కనే గల ప్రైవేట్ ఆసుపత్రి లోని రోగులు భయంతో ఆస్పత్రి మూత వేసుకోవాల్సి వచ్చింది.పోలీసులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వందలాదిగా వచ్చిన వైకాపా శ్రేణులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ముందు తమ నామినేషన్లు స్వీకరించాలని నినాదాలు చేస్తూ అరుపులు కేకలతో మారుమ్రోగించారు. విషయం తెలుసుకున్న మొలకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి ఎంపీడీవో కార్యాలయం వద్ద గూమిగూడిన వైకాపా నాయకులతో మాట్లాడి దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని శాంతియుతంగా ఎంపీటీసీలుగా నామినేషన్లు వేయడానికి అనుమతిస్తానని చెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల అధికారి సూచనల మేరకు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థులు క్యూ లైన్ లో నిలబడి నామినేషన్లు వేయడానికి సహకరించారు. తంబళ్లపల్లె మండల కేంద్రంలో జరిగిన దాడుల విషయమై సోషల్ మీడియాలో దావానలంగా వ్యాపించడంతో జిల్లా ఎస్పీ కునుబిల్లి హుటాహుటిని తంబాలపల్లి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా వచ్చిన అదనపు బలగాలు ఇరువు వర్గాలపై లాఠీ ఝలిపించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు 

గూమి గూడిన ఇరుపార్టీల నాయకులను తరిమి తరిమి కొట్టారు. దాడుల్లో కాలిన ట్రాక్టర్, వస్తు సామాగ్రి, ద్విచక్ర వాహనం ను పరిశీలించారు. ఈ దాడులకు కారకులు ఎవరని ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం చేరుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవ్వరిని ఉపేక్షించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని హితవు పలికారు. కార్యాలయం ముందు క్యూ లైన్ లో నిలబడిన వైకాపా అభ్యర్థులతో మాట్లాడి క్యూ పద్ధతిని పాటించి నామినేషన్ లో ప్రశాంతంగా వేసుకోవాలని సూచించారు. అనంతరం వైకాపా నాయకులు క్యూ లో వెళ్లి ఏడు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. సమయం మించి పోవడంతో ఇతరులకు అవకాశం దక్కలేదు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో వైకాపా, టిడిపి కూటమి నాయకుల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా జరుగుతుందా లేదా అని అటు ఎన్నికల అధికారులు, ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండే తంబళ్లపల్లె లో ఎన్నికల పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న యాగి ని చూసి స్థానిక ప్రజలు భయాందోళనలకు గురి కావడంతో పాటు ఇది ప్రజాస్వామ్యమా నామినేషన్లకే ఇలా ఉంటే ఎన్నికల అప్పుడు ఎన్ని గలాటాలు జరుగుతాయోని ప్రజలు ఈసడించుకుంటున్నారు

తంబళ్లపల్లె లో స్థానిక సంస్థల ఎన్నికలనామినేషన్ కేంద్రం వద్ద రణరంగంతంబళ్లపల్లె లో స్థానిక సంస్థల ఎన్నికలనామినేషన్ కేంద్రం వద్ద రణరంగం