స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యంనిమ్మనపల్లి మండల నాయకులతో ఎమ్మెల్యే షాజహాన్ భాషా కీలక సమావేశం
నిమ్మనపల్లి: స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపునిచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
నిమ్మనపల్లి మండలంలో స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండల పరిధిలోని 9 ఎంపీటీసీ స్థానాలు, 10 సర్పంచ్ స్థానాలు, ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ ఎన్నికల కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Mani Kumar. B






