స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు పక్కాగా పాటించాలి
- 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి ప్రక్రియ పూర్తిచేయాలి
- జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్
మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలు,నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్,పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టరును ఆదేశించారు.సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పాటిస్తూ,జీవో 154 ప్రకారం నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం వారు చేశారు.మంగళవారం రాష్ట్రసచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్,పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే,పంచాయతీరాజ్ కమిషనర్,మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు విధానం,అధికారుల బాధ్యతలు,అనుసరించాల్సిన మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ,సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీ వర్గాలకు తాజా ఓటర్ల జాబితా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు.గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,సర్పంచ్లు,ఎంపీటీసీలు,ఎంపీపీలు,జెడ్పీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియలోనూ వర్తించే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించకుండా చూడాలన్నారు.జీవో 154 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపులో అధికారుల బాధ్యతలను నిర్దేశించడం జరిగిందన్నారు.గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,సర్పంచ్లు,ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి,ఎంపీడీవోలకు అప్పగించిన బాధ్యతల మేరకు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లా పరిధిలో ఎంపీపీ,జెడ్పీటీసీ స్థానాలకు కేటగిరీల వారీగా రిజర్వేషన్ల నిర్ణయం,స్థానాల కేటాయింపును జిల్లా కలెక్టర్ చేపట్టాలన్నారు.జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించిన రిజర్వేషన్ల కేటాయింపును రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారని తెలిపారు.వీసీ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎంపీటీసీ,జెడ్పీటీసీ,ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియను మంగళవారం రాత్రిలోగా,సర్పంచ్లు,గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను బుధవారం సాయంత్రంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు.ప్రక్రియ పూర్తయిన అనంతరం జిల్లా గెజిట్లో ప్రచురించి,గెజిట్ ప్రతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని సూచించారు.గతంలో ఏవైనా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, నిబంధనల్లో ఎలాంటి ఉల్లంఘనలకు తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ వీసీలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో ప్రభాకర్ రావు,జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ,మున్సిపల్ కమిషనర్ ప్రమీల,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు పక్కాగా పాటించాలి - 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి ప్రక్రియ పూర్తిచేయాలి - జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 13 October 2026 07:56 PM
Mani Kumar. B 





